దుమ్ముగూడెంలో ‘మద్యం’ మాఫియా
సిండికేట్ డాన్ కనుసన్నల్లోనే దందా
ఎమ్మార్పీకి మించిన ధరలు వసూలు
పర్ణశాల వంటి పుణ్యక్షేత్రాల్లోనూ బెల్ట్ షాపులు
ఎక్సైజ్ అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?
వివరణ అడగగానే ఫోన్ కట్ చేసిన ఎక్సైజ్ సీఐ
కాకతీయ, దుమ్ముగూడెం : ప్రభుత్వ నిబంధనలను, ఎక్సైజ్ శాఖ నియమాలను తుంగలో తొక్కి, మద్యం సిండికేట్ ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా మారింది. దుమ్ముగూడెం మండలంలో ఒక మద్యం మాఫియా డాన్ కనుసన్నల్లో మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా మూడు లైసెన్స్‌లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క షాపును మాత్రమే చూపిస్తూ, మిగిలిన నిల్వలను బెల్ట్ షాపులకు తరలించి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ములకపాడులో రెండు, ఆర్లగూడెంలో ఒకటి చొప్పున మూడు వైన్ షాపులకు అనుమతులు ఉన్నాయి. కానీ, నిబంధనల ప్రకారం నడపాల్సిన ఈ దుకాణాలు ఇప్పుడు కేవలం ‘స్టాక్ పాయింట్లు’గా మారాయి. బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలించడమే ప్రధాన వ్యాపారంగా సాగుతోంది. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాలన్న ప్రభుత్వ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. బెల్ట్ షాపుల్లో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తూ, సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. సీతానగరం, మారాయిగూడెం, సీతారాంపురం వంటి ప్రాంతాల్లో ఈ సిండికేట్ పట్టు బిగించింది.

గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
37 గ్రామ పంచాయతీలు, 83 గ్రామాల్లో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. బడి, గుడికి సమీపంలో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నా, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక మహిళలు, సర్పంచులు బెల్ట్ షాపులు వద్దని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే నాథుడే లేడు. దీనికి తోడు, ఈ మాఫియా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు మద్యాన్ని తరలిస్తూ అక్రమ ఆదాయాన్ని గడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఇదే దందా సాగిస్తున్న ఆ ‘డాన్’, సిట్టింగ్ సౌకర్యాలు లేకుండానే అధికారులను మేనేజ్ చేయడంలో దిట్ట అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మౌనం.. వత్తాసు పలుకుతున్న వైనం!
మద్యం మాఫియా పట్ల ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిస్సహాయతను ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. అధికారులకు నిత్యం సకల మర్యాదలు, విందులు అందుతుండటంతోనే, ఫిర్యాదులు చేసినా స్పందన ఉండటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు భద్రాచలం ఎక్సైజ్ సీఐని సంప్రదించగా, ‘కాకతీయ రిపోర్టర్’ అని తెలియగానే కాల్ కట్ చేసి సమాధానం దాటవేయడం, ఈ మాఫియాకు అధికారుల అండ ఎలా ఉందో స్పష్టం చేస్తోంది. గ్రామాలు, కుటుంబాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోని అధికారుల తీరుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ నిద్రలేచి, మద్యం సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

