ఎమ్మెల్యే ఆదిపై కుట్రలు ఫలించవు
రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలు
ధాన్యం అక్రమ రవాణా కేసుతో ప్రభుత్వ విప్‌కు ఎలాంటి సంబంధం లేదు
ఆధారాలు లేని విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనం
కాంగ్రెస్ నాయకుడు బొల్లి కుమార్
కాకతీయ, వేములవాడ : రాజకీయంగా ఎదుర్కోలేకనే వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌పై ప్రతిపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని నాయకుడు బొల్లి కుమార్ మండిపడ్డారు. ఆది శ్రీనివాస్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ప్రజా నాయకుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఇటీవల వేములవాడ నియోజకవర్గ పరిధిలో వెలుగులోకి వచ్చిన ధాన్యం అక్రమ రవాణా కేసుతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. కావాలనే ఆయన పేరును ఈ వ్యవహారంలోకి లాగేందుకు కొందరు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారని బొల్లి కుమార్ ఆరోపించారు. ఈ కేసులో పట్టుబడిన ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందనే ఏకైక కారణంతో, ప్రభుత్వ విప్‌ను ఆ కేసుతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
నిజం చివరకు గెలుస్తుంది
మన దేశంలో చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, ఎవరైనా తప్పు చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం తమ పని తాము చేసుకుపోతాయని బొల్లి కుమార్ తెలిపారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, బురదజల్లే రాజకీయం చేస్తూ ప్రజాప్రతినిధులపై తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఆది శ్రీనివాస్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు ఇటువంటి దుష్ప్రచారానికి తెరలేపారని, అసత్యాలు ఎప్పటికీ సత్యాలుగా మారవని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని, నిజం చివరకు గెలుస్తుందని బొల్లి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

