ఇసుక మాఫియాపై టాస్క్ఫోర్స్ కొరడా
75 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు కొత్తపల్లి మండలంలో మంగళవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బావుపేట పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మైనింగ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ఇసుకను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించి తదుపరి చర్యలు చేపట్టారు.

