ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ అప్రమత్తం
దొంగ ఓట్లను అడ్డుకోవాలి
మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలోని 7వ వార్డులో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీ బీఎల్ఏలు, నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటం మరియు ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్త వహించడం పార్టీ శ్రేణుల బాధ్యత అని స్పష్టం చేశారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవాలని, నియోజకవర్గంలో ఒక్క అక్రమ ఓటు కూడా లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. గత పాలకులు జనగామ నియోజకవర్గంలో వేలాది దొంగ ఓట్లను నమోదు చేయించి అడ్డదారిలో గెలిచారని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ప్రక్రియలో ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి, ఎన్నికల జాబితా పారదర్శకంగా ఉండేలా కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజె మల్లేశం, మేరుగు శ్రీనివాస్ గౌడ్, మంచాల చిరంజీవులు, ఆడెపు నరేందర్, కాటం సంజీవులు, యండి ఖాజా, పాల లక్ష్మి నారాయణ, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, తుమ్మలపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

