అపహరించిన సొమ్మును రికవరీ చేయాలి
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మహిళా సంఘాల నిధుల గోల్మాల్పై సీపీఎం ఆగ్రహం
దానంపల్లి గ్రామ సందర్శనలో సీపీఎం బృందం
న్యాయం జరిగే వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరిక
కాకతీయ, చేర్యాల: దానంపల్లి గ్రామంలోని మహిళా సంఘాల నిధుల అపహరణపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సమాఖ్య ప్రతినిధులను శుక్రవారం సీపీఎం బృందం కలిసి వివరాలు సేకరించింది. గ్రామంలోని 27 మహిళా సంఘాలకు చెందిన నిధులు, సిబ్బంది మరియు బ్యాంకు అధికారుల సహకారంతో అపహరణకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మహిళల కష్టార్జితమైన సొమ్మును పైసా తేడా లేకుండా తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తక్షణమే సొమ్ము రికవరీ చేయకపోతే, మహిళా సంఘాల సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సూర్ణ తిరుపతి, నంగి మైసయ్య, గ్రామ ఐక్య సంఘం బాధ్యులు సాదుపల్లి కళావతి, రజిత, ఎడ్ల సునీత తదితరులు పాల్గొన్నారు.

