పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి
నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు డిమాండ్
కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవనంలో డీవైఎఫ్ఐ జిల్లా ఫ్రాక్షన్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బొడ్డు మధు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పటివరకు కేవలం గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి 55 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని, ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉందని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ను నామమాత్రంగా ప్రకటించి అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా డీజీపీలే గతంలో ప్రకటించారని, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టుల భర్తీకే మొగ్గు చూపడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. గత నాలుగు ఏళ్లుగా పోలీసు రిక్రూట్మెంట్ లేకపోవడంతో వేలాది మంది యువత కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి, 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని లేని పక్షంలో నిరుద్యోగుల తరఫున డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రావులపాటి నాగరాజు, వద్రణపు మధు, భూక్యా ప్రసాద్, వంగూరు సుందర్ రావు, భూక్యా వనజా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

