ఇన్‌స్టా మార్ట్‌కు రైడర్ల షాక్..
సమస్యల పరిష్కరించాలంటూ రైడర్ల ఆందోళన
ఖమ్మంలో మూడు స్టోర్ల ఎదుట నిరసన
డిమాండ్లను పరిష్కరించాలని 250 మంది ఆందోళన
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో పనిచేస్తున్న ఇన్‌స్టా మార్ట్ డెలివరీ రైడర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం ఆందోళనకు దిగారు. నగరంలోని కాల్వొడ్డు, జమ్మిబండ, మమత రోడ్డు ప్రాంతాల్లో ఉన్న మూడు ఇన్‌స్టా మార్ట్ స్టోర్ల ఎదుట రైడర్లు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 200 నుండి 250 మంది డెలివరీ రైడర్లు ఈ సమస్యలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సందర్భంగా డెలివరీ రైడర్లు మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు, నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లలో భాగంగా పెట్రోల్ భత్యం పెంచాలని, ప్రయాణ దూరానికి అనుగుణంగా పారితోషికం ఇవ్వాలని, క్యాన్సిల్ అయిన ఆర్డర్లకు ఫీజు చెల్లించాలని కోరారు. అలాగే, వర్షాకాల సర్జ్ ఛార్జీలు, హెల్త్ ఇన్సూరెన్స్, స్టోర్లలో తాగునీటి సౌకర్యం, మెరుగైన కస్టమర్ సపోర్ట్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైడర్ల బృందం సంబంధిత స్టోర్ హెడ్లు, మేనేజర్లకు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యోగి, ప్రవీణ్ కుమార్, నరేష్, అశోక్, వెంకట్, వీర్ల గోపి, సురేష్ గన్నవరం, వెంకట్ మొడుగు, వీరబాబు, నాగరాజు, వాసు, సైదులు, నరేష్, నవీన్, కిషోర్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

