- మెరుగైన సేవలందించడంలో అలసత్వం వద్దు
- నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు\
- మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ /హుజూరాబాద్: పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ మరియు ప్రధాన కూడళ్ల పరిశుభ్రతపై ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు అందుతున్నా సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ముందస్తు చర్యల్లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు నిరంతరం చేపట్టాలని, మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు చెత్త సేకరణను ప్రతిరోజూ సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రధాన రహదారులు, కూడళ్లు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యల రహితంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

