- పొత్తూర్ వాగులో టిప్పర్ల నిలిపివేత
- అక్రమ తవ్వకాలను ఆపాలని గ్రామస్థుల నిరసన
కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు తీవ్ర కలకలం రేపాయి. మధ్య మానేరు జలాశయం పరిధిలోని వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, గ్రామస్థులు మరియు రైతులు టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు పట్నం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యథేచ్ఛగా సాగుతున్న ఈ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బండారి నరేష్, పెద్ద సంఖ్యలో రైతులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

