మొలంగూర్ పాఠశాల భేష్
పాఠశాల నిర్వహణ, పనితీరుపై అధికారుల ప్రశంసలు
విద్యా ప్రమాణాలపై రీసెర్చ్ అసోసియేట్ ప్రభాకర్ సంతృప్తి
కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పనితీరు ఎంతో ఆదర్శవంతంగా ఉందని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ రీసెర్చ్ అసోసియేట్ గొల్లే ప్రభాకర్ పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ పర్యవేక్షణలో భాగంగా బుధవారం ఆయన ఈ పాఠశాలను సందర్శించి, నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించారు. పాఠశాలలో తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, వంటశాల, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, రికార్డుల నమోదు, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ సమక్షంలో విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. గత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ విద్యార్థి మోరె మనోహర్ సాధించిన ఘనతను, రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని, అలాగే మండల, జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు కైవసం చేసుకున్న బహుమతులను ప్రధానోపాధ్యాయురాలు వివరించారు. ఈ విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని ప్రభాకర్ అభినందించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు దాతల సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్న తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూదరి రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

