కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం
3 నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభం
రూ.840 కోట్లతో నగర అభివృద్ధికి ప్రణాళిక
మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
శివారు గల్లీల్లోనూ సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతాం
ఎంపీగా కరీంనగర్ అభివృద్ధికి రూ.22 వేల కోట్ల నిధులు తెచ్చా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్లతో రాబోయే మూడు నెలల్లోనే కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరాభివృద్ధిపై తన కార్యాచరణను వివరించారు. నగరంలోని 47, 62వ డివిజన్లలో రూ.1.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎంపికైన 17 యూసీఎఫ్ ప్రాజెక్టుల్లో కరీంనగర్‌కు చోటు దక్కడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాటు శివారు ప్రాంతాల్లోని గల్లీల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నగరంలో పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.25 కోట్లతో ప్రత్యేక పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి
గతంలో నిధుల కొరతతో కుంటుపడిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం కేంద్ర సహకారంతో వేగవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద రూ.900 కోట్లు, అమృత్-1, 2 పథకాల ద్వారా రూ.279 కోట్లు, యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో నగరం అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి రూ.156 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామని తెలిపారు. తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో కేవలం రోడ్ల నిర్మాణానికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దసరా నాటికి కరీంనగర్–వరంగల్ హైవేను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, త్వరలోనే కరీంనగర్–జగిత్యాల హైవే పనులు, గన్నేరువరం వంతెన నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

