ఇండస్ట్రియల్ ఏరియాలో పోలీసుల తనిఖీలు
అంతర్రాష్ట్ర నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా
కాకతీయ, ముదిగొండ : ఖమ్మం జిల్లా పోలీసు కమిషనర్ మరియు రూరల్ ఏసీపీ ఆదేశాల మేరకు ముదిగొండ మండలంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేర నియంత్రణ, భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, వ్యక్తుల వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. అంతర్రాష్ట్ర నేరస్థుల కదలికలపై నిఘా ఉంచడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసు అధికారులు తెలిపారు.
నిరంతరం నిఘా
భవిష్యత్తులోనూ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ ఇన్‌స్పెక్టర్ మురళి, ఎస్‌ఐ అశోక్, ఏఎస్‌ఐ ఖాలిక్, హెడ్ కానిస్టేబుల్ మదార్ సాహెబ్, కానిస్టేబుళ్లు శ్రీను, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

