కాకతీయ, చందుర్తి: రాష్ట్రంలో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల సెస్ మాజీ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు అల్లాడి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెబుతూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించడం మాత్రమే సరిపోదని, రైతులకు ఆచరణాత్మకంగా తోడ్పాటు అందించే కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన పెసర్లు, కందులు, మినుములు, శనగలు తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, సాగు ఖర్చుల నిమిత్తం ప్రతి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ముందుగానే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతాంగంపై నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ముందస్తు ప్రణాళికలు అమలు చేసి ఉంటే రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చేదే కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాలని, ఉచిత విత్తనాల పంపిణీతో పాటు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకోవాలని అల్లాడి రమేష్, మొకిలే విజేందర్ కోరారు. ఈ సమావేశంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

