భక్తులతో కిటకిటలాడిన మంథని
గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది మంది భక్తులు
శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు విస్తృత ఏర్పాట్లు
కాకతీయ, మంథని :పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ గౌతమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టామని మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ గౌతమేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తుల రాకతో మంథని పట్టణం, గోదావరి తీరం, ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహందర్ రెడ్డి, కౌన్సిలర్లు గోదావరి ఘాట్లు, ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో దర్శనాలు, పూజా కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా మంథని పుణ్యక్షేత్రం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

