అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
8 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
64% డిజిటైజేషన్ పూర్తి
: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కాకతీయ, కరీంనగర్ టౌన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 64% డిజిటైజేషన్ పూర్తైందని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ నమోదు మరింత వేగవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పెండింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి
మిగిలిన 8 రోజుల గడువులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ శాతాన్ని గణనీయంగా పెంచాలని, తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిచేసి బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షిప్టెడ్, అన్‌కలెక్టబుల్, డెత్ ఓటర్లకు సంబంధించిన వివరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి మిగిలిన ఫారాలను తప్పనిసరిగా సేకరించాలని చెప్పారు. సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, సత్తినేని శ్రీనివాస్, సిరిసిల్ల అంజయ్య, మాజిద్ హుస్సెన్, ఎర్రవెల్లి రవీంధర్, ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.

