సంక్షేమం.. అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్లు
అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు
రైతు భరోసా, రుణమాఫీతో రైతులకు భారీ ఊరట
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పాలేరు నియోజకవర్గంలో రూ.7.21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమని వెల్లడి
కాకతీయ, మయూరి సెంటర్: ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి ఖమ్మం రూరల్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డాక్యా తండా గ్రామంలో రూ.1.41 కోట్ల వ్యయంతో మంగళగూడెం–డాక్యా తండా బీటీ రోడ్డు, పల్లెగూడెంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం–ఎన్‌ఎస్‌పీ మీదుగా పల్లెగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పాలనకు కేంద్రబిందువని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రైతు, మహిళ, పేద సంక్షేమమే లక్ష్యం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. వరి రైతులకు కనీస మద్దతు ధరతో పాటు సన్న వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల విలువైన రుణమాఫీ అమలు చేసి ఆర్థిక భారం తగ్గించామని వివరించారు. మహిళల సాధికారత కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల, రెండో విడతలో రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసి ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల ఇళ్లను ఆమోదించామని తెలిపారు. రెండో విడతలో మిగిలిన గ్రామాలకు, అనంతరం మూడో, నాలుగో విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ రహదారులు, తాగునీరు, విద్యాసంస్థలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పోకబత్తిని అనిత, ఎన్. శ్రీనివాస్, భూక్యా శ్రీనివాస్, మహేష్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

