వెలుగుమట్ల ఇళ్లు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం
బాధితులకు వెలుగుమట్లలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
న్యాయం చేయకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తాం
డా. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్
జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమందితో నిరసన ర్యాలీ
భూదాన బాధితులకు అండగా ఉంటామని హామీ
కాకతీయ, ఖమ్మం టౌన్ : వెలుగుమట్ల భూదాన బాధితుల ఇళ్ల కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని, బాధితులందరికీ వెలుగుమట్లలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డా. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 15 ఏళ్లుగా భూదాన భూమిలో నివసిస్తున్న పేదల ఇళ్లు కూల్చడం అమానుషమని, ప్రభుత్వం వెంటనే మిగిలిన బాధితులందరికీ అదే ప్రాంతంలో ఇళ్లు కేటాయించాలని కోరారు. లేకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తడమే కాకుండా రాష్ట్రపతిని కలిసి అధికారులపై చర్యలు కోరతామని తెలిపారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, వెలుగుమట్ల భూదాన వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో భూ అక్రమాల కోసమే కుట్ర జరిగిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయపరంగా అండగా ఉంటానని, అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. డా. విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ, జేఏసీ పోరాటం వల్లే 311 మందికి ఇళ్లు మంజూరయ్యాయని, మిగిలిన బాధితులకు కూడా వెలుగుమట్లలోనే ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్పీఐ తెలంగాణ ఇన్చార్జి మేజర్ చంద్రకాంత్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల ముదిరాజ్ రాఘవేంద్ర, తెలంగాణ విఠల్, న్యాయవాది పంజాకుల లక్ష్మీనారాయణ, జేఏసీ నాయకులు, భూదాన బాధితులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

