బాధ్యతాయుత పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ కావాలి
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌కు మరింత పదును
గ్రామాల్లో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
కాకతీయ, వేములవాడ : “నేరాల నియంత్రణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు చేరువగా సేవలు అందించాలి” అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి ఫుట్డ్రిల్, లాఠీడ్రిల్ను పరిశీలించారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ వ్యవస్థ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా అంశాలను సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో అధికారులు, విపివోలు నిరంతరం పర్యటిస్తూ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. బ్లూ కోల్ట్, పెట్రోకార్ బృందాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అలాగే “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను చైతన్యపరిచి, నేరాల నియంత్రణతో పాటు కేసుల ఛేదనలో వాటి ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్రాజం తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

