రేగాపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్
సస్పెన్షన్‌తో పాటు నిష్పక్షపాత విచారణకు సహకరించాలని డిమాండ్
కాకతీయ, పినపాక : మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పినపాక మండల కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పేరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మహిళల గౌరవానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైనా ఉందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతపై బీఆర్ఎస్ పార్టీ తక్షణ క్రమశిక్షణ చర్యలు తీసుకుని, దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బోడ రమేష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పూణెం వెంకటేశ్వర్లు, దిశ కమిటీ మండల అధ్యక్షుడు మద్దెల సమ్మయ్య తదితరులు మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో రాజీకి తావులేదన్నారు. ఆరోపణలపై చట్టప్రకారం పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం కలిగేలా బీఆర్ఎస్ స్పందించాలని కోరారు. పార్టీ స్పందించకపోతే మహిళలతో కలిసి మండల వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

