వేణుకుమార్కు మరోసారి అండగా నామా
డిశ్చార్జ్ బిల్లు మాఫీ చేయించిన మాజీ ఎంపీ
ఇప్పటికే రూ.50 వేల సాయం.. కుటుంబానికి భరోసా
కాకతీయ, ఖమ్మం టౌన్ : గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి. వేణుకుమార్ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి అండగా నిలిచారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి వేణుకుమార్ డిశ్చార్జ్ బిల్లును మాఫీ చేయించారు. ఇప్పటికే నామ ట్రస్ట్ తరఫున వేణుకుమార్కు రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన నామా నాగేశ్వరరావు, కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వేణుకుమార్కు సకాలంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ కేసోజు భారత్ బాబు, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వేణుకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా నామా నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వేణుకుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నామ, ధైర్యంగా జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. పూర్తిగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువత ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యల వంటి నిర్ణయాలకు పాల్పడవద్దని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.

