ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ ఎజెండా
భూ సమస్యలు పరిష్కరించి అర్హులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
కూసుమంచిలో రూ.6.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కాకతీయ, ఖమ్మం బ్యూరో/కూసుమంచి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పర్యటించిన మంత్రి సుమారు రూ.6.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజుపేట బజార్–భద్రు తండా మధ్య రూ.1.76 కోట్లతో బీటీ రోడ్డు, ఈశ్వరమాదారం–తాళ్లగడ్డ తండా వరకు రూ.50 లక్షల రోడ్డు, చౌటుపల్లిలో రూ.3.20 కోట్ల హై లెవల్ బ్రిడ్జి, లింగారం తండాలో రూ.1.28 కోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, లింగారం తండాలో ఇప్పటికే రూ.5.45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు
రాష్ట్రంలోని భూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, పాలేరు ప్రాంతంలో రీ-సర్వే చేపట్టి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేస్తామని మంత్రి తెలిపారు. నకిలీ పాస్‌బుక్‌లను రద్దు చేసి, సర్వే ఆధారంగా అసలైన హక్కుదారులకు భూమి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. అనంతరం లింగారం తండాలో రైతులతో కలిసి పొలంలోకి దిగి ఎద్దులతో స్వయంగా దుక్కి దున్ని, వ్యవసాయ పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, డీవైఎస్‌వో సునీల్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

