కళ్యాణలక్ష్మిపై ‘కుట్ర’!
తులం బంగారంతో రూ.లక్ష ఇవ్వాల్సిందే.. బీఆర్‌ఎస్ భగ్గు
హైకోర్టు కేసుపై ప్రభుత్వం వైఖరి వెల్లడించాలి
మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి
వేములవాడలో భారీ ర్యాలీ.. తహసీల్దార్‌కు వినతిపత్రం
కాకతీయ, వేములవాడ : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాలతో పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకాలు ఎంతో అండగా నిలిచాయని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రూ.51 వేలతో పథకాన్ని ప్రారంభించి, దశలవారీగా రూ.75 వేలకు పెంచిందన్నారు. అనంతరం అన్ని వర్గాల అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116 వరకు ఆర్థిక సాయం అందించిందని తెలిపారు.

తులం బంగారం హామీ ఏమైంది?
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మహిళల ఓట్లు పొందిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదన్నారు. పేదల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన అంగన్‌వాడీ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని నాయకులు ఆరోపించారు. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను తొలగించే వైఖరిని ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. ఉచిత పథకాలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించడంలో నిర్లక్ష్యం ఎందుకు జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం
బీఆర్‌ఎస్ మహిళా కౌన్సిలర్లు ఏనుగు జ్యోతి, వెంగళ అనిత మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రూ.లక్షతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాసాల లావణ్య-శ్రీనివాస్, ఏనుగు తిరుపతిరెడ్డి, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు గూడూరి మధు, సిరిగిరి రాంచందర్, మారం కుమార్, కొండ నర్సయ్య, రేగుల రాజేశం, పెద్ది రాజు, గోస్కుల నర్సయ్య, ఉల్లెందుల హన్మంత్, మహిళా నాయకురాళ్లు మొట్టల అనూష, జంగిటి శ్రీనిధి, పెద్ది లలిత, మంతె సందీప్, సుంకపాక రాజు, వెంకట్‌రెడ్డి, సత్తిరెడ్డి, నిమ్మశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

