కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ను కాపాడాలి
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా
పథకాలను నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలి
పెండింగ్ సాయం వెంటనే విడుదల చేయాలి
తులం బంగారం హామీ ఏమైంది
హైకోర్టు కేసులో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు
బీఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని కోరారు. సోమవారం బీఆర్ఎస్ ఖమ్మం నగర పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్, ఆంధ్రాబ్యాంక్ సొసైటీ చైర్మన్ బి.రెడ్డి నాగచంద్రారెడ్డి, కర్ణాటి కృష్ణ తదితరులు మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో పేదలకు అండ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఆర్థిక భారంగా మారుతున్న విషయాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించిందని నాయకులు గుర్తుచేశారు. ప్రారంభంలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని తెలిపారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అమలు చేసిన పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు విస్తరించారని పేర్కొన్నారు. సుమారు 13 లక్షల కుటుంబాలకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం అందించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా, ఇప్పటికే అమలులో ఉన్న పథకాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, కల్యాణలక్ష్మి సాయం ఎప్పుడు అందిస్తారని పేదింటి ఆడబిడ్డలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు.
పెళ్లయి పిల్లలు పుట్టినా సాయం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అర్హులైన లబ్ధిదారులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని నాయకులు తెలిపారు. కొందరికి పెళ్లయి పిల్లలు పుట్టినా సాయం అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆమోదమైన దరఖాస్తులకు సంబంధించిన చెక్కుల పంపిణీలోనూ జాప్యం జరుగుతోందని విమర్శించారు. కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం పలుమార్లు గడువు లభించినా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన పథకంపై ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేదని నిలదీశారు. ఇతర కీలక కేసుల్లో ప్రైవేటు న్యాయవాదుల సేవలు తీసుకునే ప్రభుత్వం, కల్యాణలక్ష్మి విషయంలో ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ప్రశ్నించారు. పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెండింగ్ సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, తులం బంగారం హామీ అమలుపై ప్రకటన చేయాలని కోరారు. పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన పథకాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోటా రామారావు, నాగండ్ల కోటి, మాటేటి నాగేశ్వరరావు, పల్లా రోస్లీనా, కూరాకుల వలరాజు, పసుమర్తి రాంమోహన్, బుర్రి వెంకట్, జ్యోతి రెడ్డి, మహ్మద్ తాజుద్దీన్, బుర్రి వినయ్, పాలడుగు పాపారావు, ఊటుకూరి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

