మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
కాకతీయ, ఖమ్మం: మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న గౌడ్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం కోసం ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. జానయ్య, బీసీ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

