ఫీజు బకాయిలు చెల్లించండి
లేదంటే మరో ఉద్యమమే!
రేవంత్ సర్కారుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం
ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు, తల్లిదండ్రులు సతమతం
కాంగ్రెస్ కార్యకర్తల్లోనే రేవంత్ తీరుపై అసంతృప్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు వదిలిపెట్టం
ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూముల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సమకూరుతున్నా.. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వానికి మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పొరపాటున రేవంత్‌రెడ్డికి ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని ఈటల పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ‘‘రేవంత్ మా పార్టీలోకి ఉడుం లెక్క చేరిండు.. మరో 20 ఏళ్లు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేశాడు’’ అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు.

ఫీజులు చెల్లించకపోతే పిల్లలు ఏం కావాలి?
పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని ఈటల రాజేందర్ అన్నారు. కూలి చేసుకునే వారు, ఆటోలు నడిపేవారు, కూరగాయలు అమ్ముకునే వారి పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నమ్మకంతో కళాశాలల్లో చేరారని చెప్పారు. చదువులో చేరిన తర్వాత ఫీజులు చెల్లించబోమంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎటు వెళ్లాలని ప్రశ్నించారు. బకాయిలు రాక కళాశాలలు సిబ్బంది జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని, వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
విదేశీ యూనివర్సిటీలతో ప్రయోజనమేంటి?
తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసినంత మాత్రాన రాష్ట్రం బాగుపడదని ఈటల అన్నారు. తెలంగాణలో చదువుకున్నవారే ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శాంతను నారాయణ్ అడోబ్ సీఈవోగా, సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవోగా, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎదిగారని గుర్తుచేశారు. అరవింద్ కృష్ణ, రవికుమార్, అజయ్ బంగా, ఇంద్రా నూయి, వివేక్ మూర్తి, రాజ్ సుబ్రహ్మణ్యం తదితరులు భారతదేశంలో చదువుకున్న వారేనన్నారు. స్కైరూట్ వంటి సంస్థల ద్వారా ఆకాశాన్ని జయిస్తున్నది కూడా తెలంగాణ యువతేనని చెప్పారు. విద్యతోనే సమానత్వం సాధ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని కొఠారి పేర్కొన్నారని ఈటల గుర్తుచేశారు. విద్యార్థుల మేధస్సు వికసిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విశ్వసించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడి వారి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
మెడలు వంచాల్సిన సమయం వచ్చింది
రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజలకు తల్లిదండ్రి లాంటి వారని ఈటల అన్నారు. ఆ బాధ్యతను రేవంత్‌రెడ్డి విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తోలుమందం అయ్యింది. మెడలు వంచాల్సిన సమయం వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. రైతుబంధు అందక 60 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు, ఆటోడ్రైవర్లు తదితర వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు, కార్మికులు, రైతుల పిల్లలు కూడా ఉన్నతంగా చదువుకోవాలన్నదే బీజేపీ పోరాటమని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వసూలు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి తనకు అనుకూలంగా పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఈటల ఆరోపించారు. అయితే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ‘‘సోయి లేని ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలోని బకాయిలు చెల్లించబోమని చెప్పడం సరికాదని అన్నారు. పార్టీలు వస్తాయి.. పోతాయి.. ప్రభుత్వాలు శాశ్వతమని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయనే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని, మరో ఉద్యమం చేసే పరిస్థితి రాకముందే ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

