శరవేగంగా సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్
నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలి
మ్యూజియం, ఫ్లోరింగ్, గార్డెనింగ్ పనులపై ప్రత్యేక దృష్టి
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభం
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ హామీకి అనుగుణంగానే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మ్యూజియం పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా టూరిజం ప్రాజెక్ట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.


