ఆ ఇద్దరితో పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు!
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ సంఘం సిఫారసు
వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యం
సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని చైర్మన్ మల్లు రవి ప్రతిపాదన
చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సూచన
గతంలో హెచ్చరించినా సురేఖ వైఖరిలో మార్పు లేదు
అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది
క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, బహిరంగ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం కఠిన వైఖరి అవలంబించింది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సూచించినట్లు కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మంగళవారం వెల్లడించారు. ఇద్దరి వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కమిటీ భావించిందన్నారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ తన పరిధిలో చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందించిందని, తదుపరి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

సురేఖకు పదవి ఎసరు!
మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ స్పష్టంగా సిఫారసు చేసినట్లు మల్లు రవి తెలిపారు. ఆమె కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మొదలైన విషయం తెలిసిందే. సుస్మిత వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించాల్సి ఉందని గతంలోనే మల్లు రవి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఆమె వివరణ తీసుకున్న తర్వాతే కమిటీ తాజా నివేదిక రూపొందించింది. వనపర్తి రాజకీయాలపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. తనకు కాకుండా డబ్బులకు ఆశపడి ఇతరులకు టికెట్లు ఇచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయనకు కూడా కమిటీ నోటీసు ఇచ్చి వివరణ కోరింది. గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని మల్లు రవి వ్యాఖ్యానించారు.
‘వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం’
‘‘కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణే ముఖ్యం. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడకూడదు. నేతలు బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయి’’ అని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లు మల్లు రవి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో నాయకులంతా సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాల్లో క్రమశిక్షణ కమిటీ తన పని పూర్తి చేసిందని మల్లు రవి తెలిపారు. ఇద్దరి వివరణలను పరిశీలించిన తర్వాతే నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ఇక తుది నిర్ణయం ఏఐసీసీదేనన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలిపారు. అక్కడి నుంచి అధిష్ఠానం నిర్ణయం వెలువడనుంది.
ఇప్పటికే సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలపై నోటీసులు, వివరణల దశ పూర్తవడంతో.. పదవుల నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

