వరంగల్ అభివృద్ధికి నిధులివ్వండి
కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి
పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలి
నైలిట్, సీఐటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కావాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు సంస్థలు, నిధులను వరంగల్‌కు తీసుకురావాలని సీఎంను కోరారు. కాకతీయ యూనివర్సిటీకి పీఎం–ఉషా నిధులు, వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి రూ.10 కోట్లు, నైలిట్, సీఐటీడీ కేంద్రాల ఏర్పాటు, పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కోసం కేంద్రంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి పీఎం–ఉషా పథకం కింద ప్రతిపాదించిన నిధులను కేంద్రం నుంచి త్వరగా మంజూరు చేసి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కావ్య కోరారు. విద్య, పరిశోధన, మౌలిక వసతులను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులు, పరిశోధకులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.
మ్యూజియానికి రూ.10 కోట్లు
వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రూ.10 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. 1991లో ఏర్పాటైన పాత మ్యూజియం భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవన నిర్మాణం 2023 మేలో పూర్తయినా కళాఖండాల తరలింపు, పరిరక్షణ, ప్రదర్శన, భద్రత, వాతావరణ నియంత్రణ వంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. వరంగల్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కావ్య కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రంగాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు శిక్షణ, ధ్రువపత్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఐటీడీ కేంద్రం ఏర్పాటుతో ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు ఎంఎస్‌ఎంఈలకు ఆధునిక సాంకేతిక శిక్షణ, సాంకేతిక సహకారం అందుతుందని పేర్కొన్నారు.
పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ కేంద్రం కావాలి
వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం స్థానంలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తత్కాల్ పాస్‌పోర్ట్ సేవల కోసం కరీంనగర్, సికింద్రాబాద్ వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరంగల్–హనుమకొండ–కాజీపేట త్రినగర ప్రాంతంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ప్రాంత విద్యార్థులు, యువత, పరిశోధకులు, ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కాకతీయుల చారిత్రక వారసత్వ పరిరక్షణకు కేంద్ర సహకారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కావ్య కోరారు. ఆమెతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కావ్య ప్రస్తావించిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో చర్చించి కేంద్రంతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

