కారులో భీకర అగ్నిప్రమాదం!
డీజిల్ లీకేజీతో క్షణాల్లో వ్యాపించిన మంటలు
డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం
కాకతీయ, హన్మకొండ : స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై డస్టర్ కారు అగ్నికి ఆహుతైంది. డీజిల్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. హనుమకొండ నుంచి మల్లన్నగండికి ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో వెళ్తుండగా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై ఇంజన్ నుంచి పొగలు వెలువడ్డాయి. వెంటనే స్పందించిన డ్రైవర్ కారును రహదారి పక్కన నిలిపి, ఇద్దరూ కిందకు దిగారు. కొద్దిసేపటికే డీజిల్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి వాహనం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరి ప్రాణాలు నిలిచాయి. కళ్లముందే కారు మంటల్లో కాలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

