అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
సేవల వేగం, పారదర్శకతకు ఊతం
కాకతీయ, జమ్మికుంట : మండల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం కార్యక్రమాన్ని ప్రారంభించి ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి సాంకేతిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా సేవలకు సంబంధించిన వివరాలను వెంటనే నమోదు చేయడం, ఆన్లైన్‌లో నివేదికలు పంపడం, లబ్ధిదారులతో సంప్రదింపులు కొనసాగించడం సులభమవుతుందని తెలిపారు.ఈ చర్యలతో సేవల్లో పారదర్శకత, వేగం పెరుగుతాయని, డిజిటల్ విధానాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఇది ఒక ముందడుగని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సూపర్వైజర్లు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

