డంపింగ్ యార్డ్ రద్దుకు రోడ్డెక్కిన బీజేపీ
హుజూరాబాద్‌లో భారీ నిరసన..రాస్తారోకో
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.. తోపులాట.. నేతల అరెస్ట్
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం : గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు బుధవారం ఉవ్వెత్తున నిరసన చేపట్టాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. అనంతరం పోలీసులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పర్యావరణానికి ముప్పు
ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాంతియుత నిరసనలను అణచివేయాలని చూడటం దారుణమని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల హుజూరాబాద్ పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుందని, పశుగ్రాసం కూడా విషతుల్యం అవుతుందని హెచ్చరించారు. రైతాంగానికి తీరని నష్టం వాటిల్లే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాజకీయ డ్రామాలు వద్దు
గత నెల రోజులుగా ప్రజలు, కుల సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అహంకారపూరితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మొండి వైఖరి వీడి డంపింగ్ యార్డ్ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ గడ్డపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ, మండల, జిల్లా స్థాయి నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

