మృతిరాలు బాలవ్వ …బంగారు కమ్మలు మాయం…!
కాకతీయ, కరీంనగర్/జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలన ఘటన వెలుగుచూసింది. మృతదేహం నుంచి బంగారు కమ్మలు మాయమవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళ్తే… కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బాలవ్వ అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందింది. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే, ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా, బాలవ్వ చెవులకు ఉన్న బంగారు కమ్మలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రిలోనే అవి మాయం అయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తూ సిబ్బందిపై ఆరోపణలు గుప్పించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు స్వీకరించారు.
మృతదేహం నుంచి ఆభరణాలు మాయం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిజానిజాలు తేలాల్సి ఉంది.

