కరీంనగర్లో ఉద్రిక్తత.. టీఆర్పీ నేతల అరెస్ట్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
అణచివేత చర్యలు సరికావన్న అఖిల్ పాషా
కాకతీయ, కరీంనగర్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెకు సంఘీభావం తెలిపిన వారిలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం ప్రమాదకరమని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, పోలీసులతో అణచివేతకు దిగడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడ్డారు. కార్మికుల పక్షాన నిలబడిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం హక్కులను హరించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, వాజిద్, అంకుష్, రమేష్, మహబూబ్ అలీ, జింక లావణ్య, ఓర్సు విమల, శివరాత్రి మోహన్, దురుశెట్టి చందు తదితరులు పాల్గొన్నారు.

