మూత్రశాలలో పసిపాప..
బస్టాండ్‌లో వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
శిశువును రక్షించిన మహిళ, పోలీసులు
కాకతీయ, వేములవాడ: కన్నపేగు కాదని అనుకున్నారో.. లేక ఆడపిల్ల అని భారంగా భావించారో గానీ, పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ పసిపాపను మూత్రశాలలో వదిలివెళ్లిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్‌లోని మూత్రశాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును వదిలి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. బస్టాండ్‌లోని మూత్రశాల ప్రాంతం నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడ ఉన్న ఓ మహిళ అప్రమత్తమయ్యారు. దగ్గరకు వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పాపను సురక్షితంగా బయటకు తీశారు.
ఆసుపత్రిలో చికిత్స.
శిశువును వెంటనే సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పాపకు అత్యవసర చికిత్స అందించి, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అక్కున చేర్చుకోవాల్సిన పసికందును ఇలా అపరిశుభ్ర ప్రాంతంలో వదిలివెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బస్టాండ్‌లోని సీసీీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

