చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే గంగుల సానుకూల స్పందన
కేంద్రంలో హైమాస్ లైట్ల ఏర్పాటుకు హామీ
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని చింతకుంటలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, పంట సాగు మరియు కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి సమయాల్లో వెలుతురు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన తక్షణమే స్పందిస్తూ.. నగరపాలక సంస్థ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే లైట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలి..
ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులను గంగుల కమలాకర్ ఆదేశించారు. కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం ఆలస్యం చేయకుండా వెంటనే తూకం వేయాలని సూచించారు. రైతులకు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీఎంఎస్ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

