డంపింగ్ యార్డుతో అనారోగ్యాల ముప్పు
రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ
హుజురాబాద్‌లో మోకాళ్లపై కూర్చొని రజక సంఘం నేతల నిరసన
హుజూరాబాద్‌లో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు
నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, హుజూరాబాద్: ఉద్యమాల గడ్డగా పేరొందిన హుజూరాబాద్‌ను డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో కాట్నాల గడ్డగా మారుస్తారా? అని రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ ప్రశ్నించారు. పట్టణ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలకు రజక సంఘం ఆదివారం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చౌరస్తా వద్ద మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కాలుష్యం పెరిగి స్థానికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి యార్డును నిర్మించడం సరైంది కాదని హితవు పలికారు.
ఐక్య పోరాటమే మార్గం
తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సకల జన సమ్మె స్పూర్తితో, డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటంలో అన్ని వర్గాలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

