పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి
3వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన
అర్హులందరికీ పథకం వర్తింపజేస్తామని వెల్లడి
కాకతీయ, చేర్యాల: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని చేర్యాల మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు అన్నారు. ఆదివారం వార్డు పరిధిలోని బురాన్ మియా తోట కాలనీలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం ఇళ్ల మంజూరులో పేదలను విస్మరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిల సహకారంతో అర్హులైన వారందరినీ గుర్తించి ఇళ్లు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాజా, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఉడుముల బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు, సీనియర్ నాయకులు బుట్టి యాదగిరి, గణేష్, తుమ్మ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

