రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు
కేశవపట్నం రైతు వేదికలో అవగాహన సదస్సు ప్రారంభం
అధిక యూరియా వాడకంపై అధికారుల హెచ్చరిక
కాకతీయ, శంకరపట్నం: రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక లాభాలు గడించాలనే లక్ష్యంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సోమవారం మండలంలోని కేశవపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఏఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు జిల్లావ్యాప్తంగా 64 క్లస్టర్లలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల నేల స్వభావం దెబ్బతింటుందని, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఐ. తిరుపతి మాట్లాడుతూ.. జనుము, జీలుగా వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుతో భూసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా, కునారం వరి-2, సిద్ది వంటి రకాలను సాగు చేయాలని రైతులకు వివరించారు.
పంట మార్పిడి అవసరం..
సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) శ్రీధర్ మాట్లాడుతూ.. రైతులు కేవలం వరి, పత్తికే పరిమితం కాకుండా పంట మార్పిడి పద్ధతులు పాటించాలని కోరారు. వ్యవసాయానికి సంబంధించిన రశీదులను భద్రపరుచుకోవాలని, సాగులో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. రాణి, మండల వ్యవసాయ అధికారి జి.వెంకటేష్, ఏఈఓలు స్రవంతి, కీర్తన, రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ విజయ్‌కుమార్ మరియు మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

