పేరుకే ‘గ్రామీణ’.. రైతుకు తప్పని వడ్డీ వడ్డింపు!
రెన్యువల్ పేరిట అదనపు బాదుడు..
ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ చార్జీల మోత
కేంద్రం ఇచ్చే రిబేటుపై నమ్మకం లేని బ్యాంకు
షెడ్యూల్డ్ బ్యాంకులతో పొంతన ఏది?
ఖాతాదారులకు తెలియకుండానే ‘ఇన్సూరెన్స్’ కటింగ్
చింతకాని మండలంలో అన్నదాతల ఆవేదన
కాకతీయ, చింతకాని : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన గ్రామీణ బ్యాంకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతల పాలిట భారంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాలు పొందిన రైతులు రెన్యువల్ సమయంలో అదనపు చార్జీల బాదుడుతో బెంబేలెత్తుతున్నారు. ఒకే రకమైన వ్యవసాయ రుణాలకు షెడ్యూల్డ్ జాతీయ బ్యాంకులు ఒకలా.. గ్రామీణ బ్యాంకులు మరోలా వ్యవహరిస్తుండటంతో రైతులు నిండా మునుగుతున్నారు.
అదనపు చార్జీల మోత.. రూ.3,800 కట్!
సాధారణంగా సకాలంలో రుణం తీర్చే రైతులకు ఏడాదికి ప్రతి లక్షకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అయితే గ్రామీణ బ్యాంకులో దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ చార్జీల పేరిట ప్రతి లక్షకు రూ. 1,900 అదనంగా వసూలు చేస్తుండటం గమనార్హం. మండలంలోని ఒక రైతు తన రూ. 2 లక్షల రుణాన్ని రెన్యువల్ చేసుకోగా, బ్యాంకు అధికారులు వడ్డీతో సంబంధం లేకుండా ఏకంగా రూ. 3,800 చార్జీలుగా కట్ చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ బ్యాంకుల్లో ఈ తరహా భారం లేకపోవడంతో, గ్రామీణ బ్యాంకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.
రిబేటు ఎప్పుడు వస్తుందో.. రాదో?
కేంద్ర ప్రభుత్వం రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు అందించే ఉద్దేశంతో, రైతు చెల్లించిన 7 శాతం వడ్డీలో 3 శాతాన్ని రిబేటు రూపంలో తిరిగి ఇస్తుంది. జాతీయ బ్యాంకుల్లో ఈ నగదు వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా.. గ్రామీణ బ్యాంకులో మాత్రం ఏడాదైనా ఆచూకీ ఉండటం లేదు. బ్యాంకు అధికారులను అడిగితే “నాబార్డ్ నుంచి రావాలి.. మాకు తెలియదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా 18 నెలల తర్వాత అరకొరగానే జమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిధి పేరుతో రైతుల బందీ!
మరోవైపు, గ్రామీణ బ్యాంకుల దోపిడీ భరించలేక రైతులు జాతీయ బ్యాంకులకు వెళ్తే.. “ఆ గ్రామం మా పరిధిలోకి రాదు” అంటూ అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు ఇష్టం లేకపోయినా గ్రామీణ బ్యాంకులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇవే కాకుండా, ఖాతాదారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఎస్బీఐ ఇన్సూరెన్స్ వంటి ప్రీమియంలు కట్ చేస్తున్నారని, అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. అన్ని బ్యాంకుల్లో రుణాల విధివిధానాలు ఒకేలా ఉండాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామీణ బ్యాంకుల అడ్డగోలు చార్జీలకు అడ్డుకట్ట వేయాలని చింతకాని మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.

