ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా దివాకర బాధ్యతల స్వీకరణ
శుభాకాంక్షలు తెలిపిన అధికార యంత్రాంగం
కాకతీయ, మయూరి సెంటర్: ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్‌గా టి.ఎస్. దివాకర సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దివాకరను అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పద్మశ్రీ, ఆర్డీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది నూతన కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

