మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం
హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ
కాకతీయ, కరీంనగర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం స్థానిక ఇందిరా గార్డెన్లో నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల అండదండలతోనే విజయం సాధించానని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల నిధులను నేరుగా మహిళల పేర్లతోనే జమ చేస్తున్నామని వివరించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ స్ఫూర్తితో మహిళలు రాజకీయాల్లోనూ చురుగ్గా రాణించాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు తగిన గుర్తింపు..
పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన మహిళా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిబద్ధత కలిగిన నేతల జాబితాను సిద్ధం చేసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు అందజేస్తామని, తద్వారా నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కేలా కృషి చేస్తామని తెలిపారు. మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలకు పార్టీ యంత్రాంగం పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

