ప్రతి గ్రామంలో ‘మేడే’ జెండా ఎగరాలి
లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగించాలి
న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు శివ నాయక్ పిలుపు
కాకతీయ, కారేపల్లి: మే 1న జరగనున్న 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి వాడలో జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు శివ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం కారేపల్లి కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని శివ నాయక్ విమర్శించారు. ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలకు మేలు చేసేలా ఉన్నాయని, వీటిని రద్దు చేసే వరకు నిరంతర పోరాటం సాగించాలని కోరారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం తమ హక్కుల సాధనకై ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలోని పాలక వర్గాలు మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయంగా ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ఆయన, సామ్రాజ్యవాద ధోరణులను అరికట్టి ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సుంకర బుచ్చయ్య, దంతాల నారాయణ, నాగేష్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

