దళారులను నమ్మి మోసపోవద్దు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపు
చీమలపాడు కళ్లాల్లో రైతులకు నేతల అవగాహన
కాకతీయ, కారేపల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రైతులు తాము పండించిన మొక్కజొన్నను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సూచనల మేరకు శుక్రవారం సింగరేణి మండల పరిధిలోని చీమలపాడు గ్రామంలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కళ్లాల్లో పంటను ఆరబోసిన రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల మాట్లాడుతూ.. నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అప్పాయిగూడెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళ్లాల్లోని పంట నాణ్యతను పరిశీలించిన నాయకులు.. ధాన్యాన్ని వెంటనే కేంద్రాలకు తరలించాలని సూచించారు.
వ్యవసాయం పండుగ కావాలి..
రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకూ సరైన ధర దక్కినప్పుడే వ్యవసాయం పండుగలా మారుతుందని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, పాటి నరసయ్య, స్థానిక నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

