మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు బేఖాతరు!
వికలాంగ బాలికకు అందని న్యాయం
నాలుగేళ్లు గడిచినా అమలుకాని వైనం
అధికారుల నిర్లక్ష్యంపై తండ్రి ఆవేదన
కాకతీయ, కరీంనగర్: బాధితులకు బాసటగా నిలవాల్సిన మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. తన వికలాంగ కుమార్తెకు న్యాయం చేయాలని కమిషన్ ఆదేశించి నాలుగేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంపై బాధితురాలి తండ్రి షేక్ మునవర్ పాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అహ్మద్పూర్కు చెందిన మునవర్ పాషా పెద్ద కుమార్తె అతిఫా మెహరీన్ పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగురాలు. కుమార్తె సంక్షేమం, వైద్య సహాయం కోసం ఆయన 2020 ఫిబ్రవరి 25న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కమిషన్ మరుసటి రోజే (26-02-2020) బాలికకు అవసరమైన మందులు, వైద్య సదుపాయాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నిర్లక్ష్యం వీడి న్యాయం చేయాలి..
కమిషన్ ఆదేశాలు ఇచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని మునవర్ పాషా వాపోతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యమే సమాధానంగా వస్తోందని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులు స్పందించి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను అమలు చేయాలని, తన కుమార్తెను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.

