రైతన్నలకు పండుగలా ‘వారోత్సవాలు’
అన్నదాతలకు అండగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
అధిక మోతాదులో యూరియా వాడొద్దు: సాంబశివరావు
చుంచుపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో ‘రైతు వారోత్సవాలు’ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించారు. రైతులందరూ ఈ వారోత్సవాలను ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడుల ఆశతో యూరియాను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. రసాయనాల వాడకం వల్ల భూసారం దెబ్బతిని, నేల చౌడుబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు పంట మార్పిడి పద్ధతులను పాటించాలని కోరారు. అనంతరం ‘రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు’ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
జిల్లావ్యాప్తంగా 67 రైతు వేదికల్లో..
జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) బాబురావు మాట్లాడుతూ.. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలోని 67 రైతు వేదికల్లో ఈ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కేవీకే శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి భూసార పరీక్షల ప్రాధాన్యత, ఎరువుల యాజమాన్యంపై రైతులకు దిశానిర్దేశం చేస్తారని డీఏఓ తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, కేవీకే శాస్త్రవేత్తలు, యానిమల్ హస్బండరీ, వెటర్నరీ, మార్కెటింగ్ అధికారులు, ఎరువుల డీలర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

