అంజన్న కోసం అడుగులు.. దర్శనం కోసం నిరీక్షణ!
పాదయాత్రగా కొండగట్టు చేరుతున్న మాలాదారుల ఆవేదన
మండుతున్న ఎండలో ‘బొబ్బలెక్కే’ నడక..
అలసిపోయినా క్యూలైన్లలో గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి
‘త్వరిత దర్శనం కల్పించాలంటూ’ వైరల్ అవుతున్న భక్తుడి విజ్ఞప్తి
అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు
ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని భక్తుల డిమాండ్
నిజంగా ఇది న్యాయమైన డిమాండ్
ఎర్రటి ఎండలో మాలాధారులు వేలాదిగా నడుచుకుంటూ వెళ్లి..అలసి సొలిసి పోయి మళ్లీ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం అంటే నిజంగా బాధాకరం. ఎండోమెంట్ ఉన్నతాధికారులు.. కొండగట్టు ఈవో అధికారి తక్షణమే చర్యలు తీసుకుంటే వేలాది మంది మాలధారులకు… pic.twitter.com/wz1Jn7243q
— Kiran Arelly (@ArellyKiran1988) May 11, 2026
కాకతీయ, కరీంనగర్ : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా లెక్కచేయక.. “జై హనుమాన్” నామస్మరణతో వందల కిలోమీటర్లు పాదయాత్రగా వస్తున్న హనుమాన్ మాలాదారులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అయితే, రోజుల తరబడి కఠిన దీక్షతో, నియమ నిష్ఠలతో నడచి వచ్చిన భక్తులకు ఆలయానికి చేరుకున్నాక గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుండటం ఆవేదన కలిగిస్తోంది.
కదిలిస్తున్న భక్తుడి వీడియో.. ‘ప్రత్యేక’ గుర్తింపు ఏది?
ఈ నేపథ్యంలో ఓ హనుమాన్ దీక్షపరుడు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. “రోజుల తరబడి కఠిన నియమాలతో నడిచి వస్తాం.. అన్నం, నిద్ర కూడా మానేసి స్వామి దర్శనానికి వస్తే, ఇక్కడ మళ్లీ గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోంది” అంటూ ఆయన భావోద్వేగంతో చేసిన విజ్ఞప్తి భక్తులను కదిలిస్తోంది. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శనం లేదా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చింది. ఎండలో నడిచి వచ్చిన శారీరక శ్రమను గుర్తించి, వారికి త్వరితగతిన దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు
వైరల్ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అంజన్నపై అపారమైన భక్తితో కష్టాన్ని భరించి నడిచి వచ్చే మాలాదారులకు ఆలయ అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం క్యూలైన్లే కాకుండా తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, త్వరిత దర్శనం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. “అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చిన వారికి మరో గంటల పాటు నిలబడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులకు మానవత్వం లేదా?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న దృష్ట్యా అధికారులు తక్షణమే అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రత్యేక లైన్ల ద్వారా దర్శనం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల విశ్వాసానికి గౌరవం ఇచ్చి, స్వామివారి దర్శనం సులభతరం చేసేలా ఆలయ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని భక్తకోటి కోరుతోంది.

