ఆశ్రమ భూమిలో సబ్స్టేషన్ నిర్మాణానికి యత్నం
సేవ కోసం ఇచ్చిన స్థలంపై రాజకీయ కన్ను
ఆశ్రమాన్ని కాపాడాలంటున్న చార్వాక ట్రస్ట్
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వృద్ధుల ఆశ్రమానికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలనే యత్నాలపై చార్వాక ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వృద్ధుల సేవా కార్యక్రమాల కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని చార్వాక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డప్పుల అశోక్ గుర్తు చేశారు. వృద్ధులకు ప్రశాంత వాతావరణంలో ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన భూమిని ఇప్పుడు సబ్స్టేషన్ పేరుతో ఆక్రమించాలనుకోవడం బాధాకరమన్నారు.
ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించాలి
తాము విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ గ్రామపంచాయతీ ఇప్పటికే తీర్మానించిన ప్రత్యామ్నాయ స్థలంలోనే దానిని నిర్మించాలని అశోక్ స్పష్టం చేశారు. గ్రామంలో ఇతర ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండగానే వృద్ధుల ఆశ్రమ స్థలాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే ఈ భూమిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వృద్ధులు ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వృద్ధుల ఆశ్రమ భూమిని రక్షించాలని, సేవా కార్యక్రమాలకు కేటాయించిన భూములను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.

