సర్పంచ్ కప్’ విజేత మానకొండూరు జట్టు
రన్నరప్‌గా పర్లపల్లి.. బహుమతులు అందజేసిన ఎస్సై శేఖర్‌రెడ్డి
కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నంలో నిర్వహించిన ‘సర్పంచ్ కప్ సీజన్-1’ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మానకొండూరు జట్టు అద్భుత ప్రదర్శనతో పర్లపల్లి జట్టుపై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి విజేత, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. విజేత మానకొండూరు జట్టుకు రూ.20 వేలు, రన్నరప్ పర్లపల్లి జట్టుకు రూ.10 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ పోటీల నగదు బహుమతులను సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. గ్రామ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకే ఈ పోటీలు నిర్వహించామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎండీ మోయిన్, సదానందం, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

