మహిళా పోలీస్ అధికారిపై ఎస్సై వేధింపులు
మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్‌పై చర్యలు
వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ వినీత్ కుమార్ ఉత్తర్వులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) విజయ్ కుమార్.. ఒక మహిళా పోలీస్ అధికారిణిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గతంలో తన బ్యాచ్‌కే చెందిన సదరు మహిళా అధికారిణిపై ఆయన వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై విజయ్ కుమార్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటు సదరు ఎస్సైని రిజర్వు (వీఆర్)కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చట్టాన్ని రక్షించాల్సిన అధికారి ఇలా వేధింపులకు పాల్పడటం పోలీస్ శాఖలో కలకలం రేపింది.

