భానుడి భగభగలు
రెడ్ జోన్లో కరీంనగర్!
అగ్నిగుండంలా ఉమ్మడి జిల్లా
45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తీవ్ర వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన చౌరస్తాలు
మధ్యాహ్నం 12 నుంచి 4గంటల వరకు బయటకు రావొద్దని వైద్యుల సూచన
ఆస్పత్రుల్లో పెరుగుతున్న వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు
కాకతీయ, కరీంనగర్ : ఎండల తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పూర్తిగా అగ్నిగుండంలా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వడగాలులు, భరించలేనంతగా మారుతున్న ఉక్కపోత నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాను అధికారికంగా ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప సామాన్య ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా జనసంచారంతో ఎప్పుూ కిటకిటలాడే కరీంనగర్ నగరంలోని ప్రధాన కేంద్రాలైన టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తా, ప్రకాశం గంజ్, తెలంగాణ చౌరస్తా ప్రాంతాలు మధ్యాహ్న వేళల్లో పూర్తిగా నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రహదారులపై వాహన రాకపోకలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. మండుతున్న ఎండలకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వస్తుండగా, వారు కూడా తలకు గుడ్డలు కట్టుకుని, గొడుగులు పట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలుఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 24 మే 2026 ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్44.8°, జగిత్యాల44°, రాజన్న సిరిసిల్ల44°, పెద్దపల్లి44°, కరీంనగర్లో మధ్యాహ్న సమయానికి 44.8° ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ సమయంలో సాధారణ మనుషులకు అనిపించే ఉష్ణోగ్రత తీవ్రత ఏకంగా 48°C వరకు వెళ్లడం గమనార్హం. ఇదే సమయంలో గాలి వేగం గంటకు సుమారు 18.4 కిలోమీటర్లుగా నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద 40°C నుంచి 45°C మధ్య తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని, రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించారు.
ఆస్పత్రుల్లో పెరిగిన కేసులు..
తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు మండుతున్న ఎండల దెబ్బకు శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఐస్ క్రీములు మరియు పండ్ల రసాల కేంద్రాలకు విపరీతమైన రద్దీ పెరిగింది. వాతావరణ శాఖ అధికారిక సూచనల మేరకు ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ బయటి పనులను పూర్తిగా తగ్గించుకోవాలని, తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తాగుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరిస్తున్నారు.

